కూర్గ్‌.. ద‌క్షిణ భార‌త‌దేశంలో ఉన్న ఈ అంద‌మైన హిల్‌స్టేష‌న్ ప‌ర్యాట‌కుల మ‌న‌సును దోచుకుంటోంది. చేయితిరిగి చిత్ర‌కారుడి అల‌వోక‌గా గీసిన తైల‌వ‌ర్ణ చిత్రంలా క‌నిపిస్తుంది. ఎటుచూసినా ప‌చ్చ‌ద‌నం, మ‌ధ్య‌లో సెల‌యేళ్ల స‌వ్వ‌డి, జ‌ల‌పాతాల హోరు.. ప‌ర్యాట‌కుల మ‌న‌సును దోచుకుంటాయి. ఇక ట్రెక్కింగ్ లాంటి సాహ‌సాల‌ను కోరుకునే యువ‌త‌కు ఇది అతి చ‌క్క‌ని ప్ర‌దేశం. ప‌కృతి ఒడిలో సేద‌దీర‌డ‌మే కాదు.. బౌద్ధ ఆరామాలు, దేవాల‌యాలు, కోట‌ల‌ను కూడా త‌న‌వితీరా చూసి రావ‌చ్చు..

 

బెంగ‌ళూరుకు 252 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కూర్గ్.. స‌ముద్ర మ‌ట్టానికి 1525 మీట‌ర్ల ఎత్తులో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని కొడైమాల‌నాడు అని పిలిచేవారు. కూర్గ్‌నే కొంద‌రు కొడ‌గు అని కూడా పిలుస్తారు. కొడైమాల‌నాడు అంటే ఎత్తైన కొండ‌మీద ఉన్న ద‌ట్ట‌మైన అడ‌వులు అని అర్థం. ప్ర‌కృతి అందాల‌తోపాటు వ‌న్య‌మృగాలు, ప‌క్షులు, జ‌ల‌పాతాల‌కు కూర్గ్ నిల‌యం. టీ, కాఫీ తోట‌ల‌ను కూడా ఇక్క‌డ పండిస్తారు. ప్ర‌పంచంలోనే అత్యంత నాణ్య‌మైన కాఫీ గింజ‌ల‌ను ఇక్క‌డే పండిస్తారు. మ‌డికెరి, సోమ‌వారప్పేట్‌, విరాజ్‌పేట్ అనే మూడు స‌ర‌స్సులున్నాయి. ద‌క్షిణాదిని ఏలిన ప‌లువురు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

 

హ‌నీమూన్‌కు అద్భుత ప్ర‌దేశం
కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు హ‌నీమూన్‌కు వెళ్లేందుకు కూర్గ్ అద్భుత ప్ర‌దేవం. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకునేవారికి కూడా ఇదో చ‌క్క‌ని ప్రాంతం. జూలై- సెప్టెంబ‌రు మ‌ధ్య‌లో ఇక్క‌డి జ‌ల‌పాతాల హొయ‌లు చూడాల్సిందే. సాహ‌సికుల‌కు మాన్‌సూన్ సీజ‌న్ బాగుంటుంది. ఆ స‌మ‌యంలో ఇక్క‌డ రివ‌ర్ రాఫ్టింగ్ చేయ‌వ‌చ్చు. మ‌డికెరికి 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బైల‌కుప్పె.. టిబెట‌న్లు అత్య‌ధికంగా సెటిలైన ప్రాంతాల్లో ఒక‌టి. ఇక కూర్గ్ నుంచి 94 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న న‌గ‌ర్‌హోలె నేష‌న‌ల్ పార్క్ అతిపెద్ద వ‌న్యప్రాణుల పార్క్‌. ఏనుగులు, నీటిగుర్రాలు, పులులు, తోడేళ్లు వంటి ఎన్నో జంతువులను ఇక్క‌డ చూడ‌వ‌చ్చు. ప‌క్షి ప్రేమికుల‌కు ఇక్క‌డ క‌నిపించే 250 రకాల ప‌క్షులు క‌నువిందు చేస్తాయి.

స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్‌
భూలోక స్వ‌ర్గంలా అనిపించే కూర్గ్ అందాల‌ను వ‌ర్ణించ‌డం కవుల‌కు సైతం క‌ష్ట‌సాధ్య‌మే. కూర్గ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. కూర్గుకు వెళ్తుంటే దారిపొడ‌వునా క‌నిపించే ప్ర‌కృతి అందాలు కాసేపు టూరిస్టుల‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి. ప‌చ్చ‌ద‌న ప‌ర‌వ‌ళ్లు తొక్కే కూర్గులోని కొండ‌లు ఎప్పుడు చూసినా మేఘాల‌ను ముద్దాడుతూనే ఉంటాయి. విందు వినోదాలంటే ఎంతో ఇష్ట‌ప‌డే కూర్గ్ ప్ర‌జ‌లు మ‌న‌స్త‌త్వం కూడా అడ‌విలా స్వ‌చ్ఛంగా ఉంటుంది. ఇక కావేరీ న‌దికి మూల‌మైన త‌ల‌కావేరీని త‌ప్ప‌కుండా చూడాల్సిందే. మ‌డికెరికి 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుందిది. 4500 అడుగుల ఎత్తునుంచి ప్ర‌వ‌హించే దీని అందాలు వ‌ర్ణించ త‌రం కాదు.


దీన్ని చూడ‌కుండా రావ‌ద్దు
కూర్గ్ వ‌చ్చిన పర్యాట‌కులు అబ్బి ఫాల్స్‌ను చూడ‌కుండా వెనుదిర‌గ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఇది మ‌డికెరికి 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. అబ్బి అంటే స్థానిక కొడుగు భాష‌లో జ‌ల‌పాతం అని అర్థం. వేస‌విలో కూడా ఇక్క‌డ నీరు పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు చూడాల్సిన ఇంకో జ‌ల‌పాతం ఇరుప్పు ఫాల్స్‌. విరాజ్పేట్కు 48 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. దీనికి స‌మీపంలోనే ల‌క్ష్మీతీర్థ న‌ది ప్ర‌వ‌హిస్తుంటుంది. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం నాడు భ‌క్తులు ఇక్క‌డికి పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి స్థానాలాచ‌రిస్తారు. ఇందులో మునిగితే పాపాలు హ‌రించిపోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం.

 

సూర్యాస్త‌మ‌యం.. అద్భుత దృశ్యం
హిల్‌స్టేష‌న్‌లో చూడాల్సిన ఆల‌యాల్లో ఓంకారేశ్వ‌ర దేవాల‌యం ఒక‌టి. ఇస్లామిక్‌, గోథిక్ శైలిలో నిర్మించి ఈ ఆలయంలో ప‌ర‌మ‌శివుడు కొలువై ఉన్నాడు. ఆల‌య గోపురంపై ఎప్ప‌టిక‌ప్పుడు వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేసేందుకు బంతి ఆకారంలో ఉండే ఓ క్లాక్‌ను ఏర్పాటు చేశారు. ఇక కూర్గ్‌లో మ‌రో సుంద‌ర ప్ర‌దేశం రాజాస్ సీట్‌. అద్భుత‌మైన వ్యూ పాయింట్ ఇది. ఇక్క‌డి నుంచి సూర్యాస్త‌మ‌యం చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవంటే అతిశ‌యోక్తి కాదు. అప్ప‌ట్లో కొడుగు రాజులు అంద‌మైన సాయంత్రాల‌ను ఇక్క‌డే గ‌డిపేవార‌ట‌. ప‌ర్యాట‌కులు చూడాల్సిన మ‌రో ప్రాంతం భాగ‌మందాల. క‌నిక‌, కావేరి, సుజ్యోతుల అనే మూడు న‌దులు క‌లిసే చోట ఇది ఉంది. దీన్ని టెంపుల్ టౌన్‌గా కూడా పిలుస్తారు. 19 శ‌తాబ్దంలో నిర్మించి మ‌రికెడి కోట‌ను కూడా ఇక్క‌డ చూడ‌వ‌చ్చు. అంతేకాదు ఇందులో ఓ మ్యూజియం, జైలు, చ‌ర్చి, దేవాల‌యం కూడా ఇక్క‌డ ఉన్నాయి.

 

ఎనీటైం.. గో అహెడ్‌..
కూర్గ్ అందాల‌ను త‌న‌వితీరా చూడాల‌నుకునేవారు సీజ‌న్‌తో ప‌నిలేకుండా ఎప్పుడైనా వెళ్లొచ్చు. అయితే అనువైన స‌మ‌యం మాత్రం సెప్టెంబ‌రు నుంచి మార్చి వ‌ర‌కు. ఇక్క‌డ ప‌ర్యాట‌కుల‌కు స‌క‌ల స‌దుపాయాలు ల‌భ్య‌మ‌వుతాయి. ఖ‌రీదైన హోట‌ళ్లు, రిస్టార్ట్‌లు ఉన్నాయి. మ‌ధ్య త‌రగతి వారికి కూడా అందుబాటులో ఉండే హోట‌ళ్లు ఉన్నాయి.

 

ఇలా చేరుకోవ‌చ్చు
విమానం ద్వారా అయితే కూర్గుకు అతి ద‌గ్గ‌ర‌లో ఉన్న మంగ‌ళూరు(136 కి.మీ), బెంగ‌ళూరు(260 కి.మీ) చేరుకుని అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవ‌చ్చు.

రైలు ప్ర‌యాణం: కూర్గుకు అతి ద‌గ్గ‌ర్లో ఉన్న‌ది మైసూరు రైల్వే స్టేష‌న్‌. ఇది కూర్గుకు 114 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.
రోడ్గు మార్గం: మైసూరు, బెంగ‌ళూరు, మంగ‌ళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గు చేరుకోవ‌చ్చు.