ఇండ్లీ, దోశ‌, వ‌డ‌.. చాలామందికి ఇష్ట‌మైన బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఇది. హోటళ్ల‌లో అయితే వీటితోపాటు కొబ్బ‌రి, ప‌ల్లీలు, ట‌మాటా త‌దిత‌ర చ‌ట్నీలు ఇస్తారు. అవే బ్ర‌హ్మాండంగా ఉన్నాయ‌ని లాగించేస్తాం. కానీ ఇష్ట‌మైన బ్రేక్ ఫాస్ట్ కు తోడు ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ట్నీ తోడుంటే.. వావ్‌.. సూప‌ర్ క‌దూ. అయితే ఈసారి మీ ఇంట్లో ఈ టిఫిన్లు చేసుకునేట‌ప్పుడు పుదీనా చ‌ట్నీని ట్రై చెయ్యండి. అద్భుత‌మైన రుచితోపాటు జీవ‌క్రియ సాఫీగా సాగ‌డానికి సాయ‌ప‌డే ఈ చ‌ట్నీ ఇప్పుడు చాలామంది హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. మీరూ ట్రైచెయ్యండి.

 • కావ‌ల‌సిన ప‌దార్థాలు
  తాజా పెరుగు - 4 స్పూన్లు
  తాజా పుదీనా ఆకులు - క‌ప్పున్న‌ర‌
  కొత్తిమీర - క‌ప్పు
  త‌రిగిన ప‌చ్చిమిర‌ప‌కాయ - ఒక‌టి
  త‌రిగిన ఉల్లిపాయ - ఒక‌టి
  అల్లం ముక్క - చిన్న‌ది
  వెల్లుల్లి రెబ్బ‌లు - మూడు
  జిలక‌ర్ర పొడి - స్పూను
  చాట్ మ‌సాలా - స్పూను
  ఆమ్‌చూర్ పొడి - స్పూను
  ఉప్పు - త‌గినంత‌
  కావాలంటే న‌ల్ల ఉప్పు లేదంటే రాయి ఉప్పు వాడుకోవ‌చ్చు.

త‌యారీ విధానం
పెరుగును ఓ క‌ప్పులో వేసి చెమ్చాతో బాగా క‌ల‌పాలి. దీనికి జిల‌క‌ర్ర‌పొడి, ఆమ్‌చూర్ పొడి, చాట్ మ‌సాలా, ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి. అనంత‌రం పుదీనా, కొత్తిమీర ఆకులు, అల్లం, వెల్లులి, ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర‌ప‌కాయ ముక్క‌లు, కొంచెం నీళ్లు క‌లిపి మిక్సీలో వేసి పేస్టులా అయ్యేంత వ‌ర‌కు మిక్సీ ప‌ట్టాలి. త‌ర్వాత‌ దీనిని మిక్సీ లోంచి తీసి ఓ గిన్నెలో వేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు వేసి రెండూ బాగా క‌లిసిపోయేలా క‌లుపుకోవాలి. అంతే నోరూరించే రుచిక‌ర‌మైన పుదీనా చ‌ట్నీ సిద్ధ‌మైన‌ట్టే. దీనిని ముందే చెప్పుకున్న‌ట్టు ఇడ్లీ, దోశ‌, వ‌డ‌తో లాగించేయ‌డమే.