త‌మ పాత్ర‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకునే హీరోయిన్ల సంఖ్య‌ ఇటీవ‌ల ఎక్కువ‌వుతోంది. భాష రాకున్నా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్పి శ‌భాష్ అనిపించుకుంటున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయ‌మైన అన‌తికాలంలోనే ఎంచ‌క్కా తెలుగు నేర్చుకుని నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్న ర‌కుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్‌లో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు త‌మ‌న్నా కూడా త‌మిళంలో ఆ క్రెడిట్ కొట్టేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతోందట‌. త‌మిళంలో తాను న‌టిస్తున్న ధ‌ర్మ‌దురై సినిమాలో త‌మ‌న్నా త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌ధురై నేప‌థ్యంగా సాగే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌ను రామ‌స్వామి స‌ల‌హా మేర‌కు త‌మ‌న్నా ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఇక అప్ప‌టి నుంచి ఈ మిల్క్‌బ్యూటీ త‌మిళం నేర్చుకునే ప‌నిలో బిజిగా ఉంటోంద‌ట‌.