ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేసే పుదీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. అయితే చాలామందికి పుదీనా చేసే మేలుగురించి తెలియ‌దు. పుదీనా మంచి ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. క‌డుపులో వికారం, వాంతులు, త‌లనొప్పి త‌దిత‌రాల‌తో బాధ‌ప‌డేవారు పుదీనా వాస‌న చూస్తే మ‌టుమాయ‌మవుతుంది. పుదీనా ఆకుల‌ను పేస్ట్ చేసి నుదిటిపై ఉంచితే తీవ్ర‌మైన త‌ల‌నొప్పి కూడా చిటెకెలో మాయ‌మ‌వుతుంద‌న్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌న వారి ముక్కులో రెండుమూడు చుక్క‌ల పుదీనా ర‌సం వేస్తే వెంట‌నే కోలుకుంటారు.

చిన్న‌పిల్ల‌ల‌కు దివ్యౌష‌ధం
క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంతో బాధ‌ప‌డే చిన్నారుల‌కు పుదీనాతో త‌క్ష‌ణం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గోరు వెచ్చ‌ని నీటిలో నాలుగైదు చుక్క‌ల పుదీనా ర‌సం వేసి తాగించ‌డం ద్వారా త్వ‌రిత‌గ‌తిన సాంత్వ‌న లభిస్తుంది. పిల్ల‌లు జ‌లుబుతో బాధ‌ప‌డుతుంటే కొబ్బ‌రి నూనెలో మెత్త‌ని పుదీనా ముద్ద‌, క‌ర్పూరం క‌లిపి చాతీపై రాస్తే జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక నోటి దుర్వాస‌న‌తో బాధ‌ప‌డేవారు నీటిలో పుదీనా ర‌సాన్ని క‌లిపి పుక్కిలిస్తే దుర్వాస‌న త‌గ్గిపోతుంది. ఇలా చేయ‌డాన్ని అల‌వాటు చేసుకుంటే శాశ్వ‌తంగా నోటి దుర్వాసన నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే దంత స‌మ‌స్య‌లున్న‌వారికి కూడా ఇది ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. రోజూ రెండుమూడు ఆకుల‌ను న‌మ‌ల‌డం ద్వారా దంత స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వెక్కిళ్లకు కూడా ఇది మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. రోజూ పుదీనా ర‌సం తాగ‌డం వ‌ల్ల వెక్కిళ్ల‌ను తరిమేయ‌వ‌చ్చు. కీళ్ల నొప్పుల నివార‌ణ‌కు కూడా పుదీనా ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పుదీనాలో బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయి కాబ‌ట్టే దీనిని ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు.