డ్రెస్సింగ్ విష‌యంలోనే కాదు అన్నింటా మ‌గాళ్ల‌ను మించిపోతున్నారు మ‌హిళ‌లు. సైకిల్‌ నుంచి విమానం దాకా అవలీల‌గా న‌డిపేస్తూ తామెందులోనూ తీసిపోమ‌ని నిరూపిస్తున్నారు. ఇక ప‌ద్మవ్యూహాన్ని త‌ల‌పించే ట్రాఫిక్‌లోనూ బైక్‌ల‌ను ర‌య్‌మంటూ పోనిచ్చేస్తున్నారు విమెన్‌ రైడర్స్‌ గ్రూప్‌ సభ్యులు. అంతేకాదు బైక్ న‌డిపేందుకు జెండ‌ర్‌తో ప‌నేంటంటూ తిరిగి ప్ర‌శ్నిస్తున్నారు. కారును అవ‌లీల‌గా న‌డిపే పునివాలా అనే టీనేజ‌ర్ త‌న‌కు బైక్ న‌డ‌పాల‌న్న కోరిక అంత సుల‌భంగా తీర‌లేద‌ని చెప్పుకొచ్చింది. 2014లో బైక‌ర్ని రైడ‌ర్స్ గ్రూప్ నిర్వ‌హించిన రోడ్ ట్రిప్ స్ఫూర్తితో పునివాలా డ్యూక్ కేటీఎం 200 బైక్ కొని రైడింగ్ నేర్చుకుంది. డ్రైవింగ్‌పై పూర్తిగా ప‌ట్టు సాధించాక రోడ్డెక్కిన పునివాలా.. బైక్‌పై రోడ్డ‌మీద వెళ్తుంటే ఆ మ‌జానే వేరంటూ సంతోషంగా చెప్పింది. బైక్ నేర్చుకోవాల‌నుకునే మ‌హిళ‌ల‌కు త‌మ గ్రూప్ ఓ వేదిక‌గా ప‌నిచేస్తుంద‌ని బైక‌ర్ని కోఫౌండ‌ర్ ఊర్వ‌శి తెలిపారు.

 

అనూహ్య స్పంద‌న‌
బైక‌ర్ని గ్రూప్ ద్వారా బైక్ రైడింగ్ నేర్చుకుని రోడ్డుపై రివ్వుమంటూ దూసుకుపోతున్న మ‌హిళ‌ల‌ను చూసి స్ఫూర్తి పొందిన ఎంద‌రో మ‌హిళ‌లు తాము కూడా బైక్ నేర్చుకుంటామంటూ పెద్ద సంఖ్య‌లో ముందుకు వ‌స్తున్నార‌ని ఊర్వ‌శి పేర్కొన్నారు. 15మంది మ‌హిళ‌ల‌తో మొదలైన ఈ సంస్థ‌లో ఇప్పుడు 700 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఇక 2011లో ఇద్ద‌రితో మొద‌లైన మ‌రో సంస్థ బెంగాల్ లేడీ బైక‌ర్స్‌లో ఇప్పుడు వంద‌మందికి పైగా మ‌హిళా బైక‌ర్లు ఉన్నారు. బెంగ‌ళూరులో 2010లో ప్రారంభ‌మైన హ్యావ్ ఆన్ గ‌ర్ల్స్ గ్రూప్‌న‌కు పుణె, మైసూర్ వంటి న‌గ‌రాల్లోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. 2013లో ప్రారంభ‌మైన వెగాబాండ్ ట్రావెల్ ఐడియాస్.. విమెన్ ఓన్లీ టూర్లు నిర్వ‌హిస్తుంటుంది. ఇందులో 6 నుంచి 14మంది మ‌హిళ‌లు పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈ గ్రూపుల‌తోపాటు ఫ‌స్ట్‌గేర్ అనే గ్రూప్‌లోనూ బోల్డంత మంది మ‌హిళ‌లు చేరుతున్నారు. ముంబైలో ఈ సంస్థ‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. బైక్ రైడింగ్‌లో ప‌ట్టు సాధించిన అమ్మాయిలు మ‌రింత మందికి నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అహ్మ‌దాబాద్‌కు చెందిన అంజ‌లి అనే రైడ‌ర్ తాను బైక్ నేర్చుకున్న త‌ర్వాత స్వ‌యంగా త‌ల్లికే నేర్పించి రోడ్డు మీద బైక్‌పై దూసుకుపోయే అనుభ‌వం ఎలా ఉంటుందో రుచి చూపించింది. అంత‌టితో ఆగ‌క స్వ‌యంగా రైడ‌ర్ని గ్రూప్‌ను స్థాపించి మ‌రెంద‌రికో శిక్ష‌ణ ఇస్తోంది. బైక్ రైడింగ్‌తో త‌మ‌లోని ఒత్త‌డికి చెక్ పెడ‌తున్నామ‌ని అంటున్నారు విమెన్ బైక్ రైడ‌ర్లు. వీకెండ్‌లో బైక్‌పై అలా షికారు కొట్టి వ‌స్తే ఆరు రోజుల అల‌సట ఇట్టే మాయ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.